గర్భిణికి వైద్యం అందించిన వికారాబాద్‌ ఎమ్మెల్యే


కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన బచ్చంగారి సుధారాణి 9 నెలల నిండు గర్భిణి. సుధారాణికి ఎమర్జెన్సీ ఉందని ఆమె భర్త నవరత్నం గౌడ్‌ మెడికల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కి ఫోన్‌ కాల్‌ చేశాడు. దీంతో ఎమ్మెల్యే ఆనంద్‌ విషయం తెలుసుకుని సుధారాణి ఇంటికి వెళ్లాడు. ఎమ్మెల్యే స్వయంగా డాక్టర్‌ కావడంతో ఆమెకు వైద్యం అందించాడు. సుధారాణికి రక్తం తక్కువగా ఉందని పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ సూచించారు. కాన్పుకు ఇంకా 20 రోజుల సమయం ఉందని, పురిటినొప్పులు వస్తే వెంటనే ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు గర్భిణికి. సుధారాణికి కావాల్సిన మందుల ప్రిస్కిప్షన్‌ను రాసి ఇచ్చారు డాక్టర్‌. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ నవనీత విష్ణువర్ధన్‌ రెడ్డి, నరసింహరెడ్డి ఉన్నారు.