లాక్‌డౌన్‌ సక్సెస్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌వ్యాప్తికి భారత్‌ లాక్‌"డౌన్‌'తో కళ్లెంవేసింది. ముందస్తు అప్రమత్తతకు ప్రజల సహకారం తోడవడంతో విశ్వమారి దూకుడును అడ్డుకోగలిగింది. ఎనిమిది రోజులుగా దేశవ్యాప్తంగా స్వల్పంగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని రోజు లు ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తే కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇతర దేశాల అనుభవాలు, నిపుణుల సూచనలతో మన దేశంలో వైరస్‌ ప్రభావం గణనీయంగా తగ్గింది. కొవిడ్‌-19 పుట్టినిల్లయిన చైనాలో మొదటి కేసు ఈ ఏడాది జనవరి 22న నమోదైంది. ఒకేరోజు 571 కేసులు నమోదైనట్టు రికార్డులు చెప్తున్నాయి. ఫిబ్రవరి 15 వరకు 68,500, మార్చి 28 నాటికి ఆ సంఖ్య 81,439 కు చేరింది. ఇక, అమెరికాలో ఫిబ్రవరి 15న 15 కేసులతో ప్రారంభమైన ఈ మహమ్మారి వీరంగం.. మార్చి 28 నాటికి 1,23,578 కు చేరింది. ఇటలీలో ఫిబ్రవరి 15న మూడు కేసులు నమోదు కాగా.. మార్చి 28నాటికి 92,472కు చేరింది. స్పెయిన్‌లో ఫిబ్రవరి 15న రెండు కేసులే. మార్చి 28 నాటికి వాటిసంఖ్య 73,235కు చేరింది. ఫ్రాన్స్‌లో ఫిబ్రవరి 15న 12 కేసులు. మార్చి 28న 37,575 కేసులు. లండన్‌లో తొమ్మిది కేసులతో మొదలై ప్రస్తుతం 17,089 కేసులకు చేరుకున్నది.